ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యార్థుల్లో నెలకొన్న అయోమయానికి తెరపడింది. మంగళవారం (01.04.2025) జరగాల్సిన సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా జరుగుతుందని పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయ్ రామరాజు.వి. ఐఏఎస్ స్పష్టం చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలాంటి అనుమానాలు లేకుండా పరీక్షలకు హాజరుకావాలని ఆయన సూచించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ పరీక్షలను మార్చి 17 నుండి 31 వరకు పూర్తి చేయాలని షెడ్యూల్ విడుదల చేశారు. అయితే, రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏప్రిల్ 1న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు మార్పులు చేశారు.
అయితే, ఆప్షనల్ హాలిడే కారణంగా మంగళవారం పరీక్ష ఉంటుందా లేదా అనే అనుమానాలు విద్యార్థుల్లో ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. విద్యార్థుల అయోమయాన్ని తొలగిస్తూ, పరీక్ష షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులేదని విద్యా శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలు పరీక్షలపై ప్రభావం చూపవని, అందరూ పరీక్షలకు హాజరు కావాలని విద్యా శాఖ ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చింది. పరీక్షలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.