ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ఏటా దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో కర్రల సమరం ఉంటుంది. అంటే కర్రలతో రెండు గ్రూపులు కొట్టుకుంటాయి. ఈ కర్రల సమరంలో ఈసారి వేడుకల్లో 70 మంది గాయపడ్డారు. దేవతామూర్తుల కోసం ఈ కర్రల సమరం జరుగుతుంది. హింసకు తావులేకుండా బన్ని ఉత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేదు. ఈసారి కూడా ఎప్పటిలాగే హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో 70 మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
దేవతా విగ్రహాల కోసం కర్రలలతో సమరం
దేవరగట్టు కొండల్లో త్రేతాయుగంలో లోకకల్యాణం కోసం మునులు యజ్ఞ యాగాలు నిర్వహించేవారట. అయితే మణి, మల్లాసురులనే రాక్షసులు యజ్ఞ యాగాలను భగ్నం చేయగా.. విసిగిపోయిన మునులు శివపార్వతులను వేడుకుంటే.. ఆదిదంపతులు మాళ, మల్లేశ్వరులుగా అవతరించారని స్థానికులు చెబుతుంటారు. రాక్షసులతో యుద్ధం ప్రారంభమైన తర్వాత.. శివుడి చేతిలో మరణం భాగ్యమనుకున్న రాక్షసులు విజయదశమినాడు చావుకు సిద్ధమయ్యారట. ఈ క్రమంలో ఏటా తమకు నరబలి ఇవ్వాలని ఆ రాక్షసులు వేడుకోగా.. నరబలి సాధ్యంకాదని, విజయదశమి రోజున గొరవయ్య తొడ నుంచి పిడుకెడు రక్తాన్ని నైవేద్యంగా సమర్పిస్తారని వారికి చెబుతారట. అప్పటి నుంచి విజయదశమి నాడు జైత్రయాత్ర జరుగుతోంది.
వైషమ్యాలు లేకుండా పని చేస్తామని, ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతామని ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం కొండపైకి వెళ్లి స్వామి వారి కల్యాణోత్సవానికి అనుమతి తీసుకుంటారు. అక్కడ మాళ మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించి.. స్వామి పల్లకిని సుమారు 350 మెట్లు దిగి కల్యాణకట్ట దగ్గరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లే సమయంలో భక్తులు కర్రలతో తలపడతారు. ఉత్సవ మూర్తులను రక్షించుకోడానికి కర్రలతో తలపడే క్రమంలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడతారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులు బసవన్నగుడికి చేరతాయి.. స్వామి పల్లకి రాక్షసపడ దగ్గరకు వెళ్లి అక్కడ గొరవయ్య తన తొడ నుంచి పిడికెడు రక్తాన్ని రాక్షసులకు ధారపోసిన తర్వాత తిరిగి పల్లకి ఎదురు బసవన్న గుడి దగ్గరకు తీసుకొస్తారు. అక్కడ ఆలయ పూజారి భవిష్య వాణి వినిపించిన తర్వాత మళ్లీ కర్రల సమరం జరుగుతుంది. అయితే చివరకు ఉత్సవమూర్తులను కల్యాణకట్టకు చేర్చడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది.
కాగా ఈ కర్రల సమరాన్ని చూడటానికి రాష్ట్రం నలుమూలనుంచే నుంచే కాకుండా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. బన్ని ఉత్సవంలో హింసను నివారించడానికి 800 మంది పోలీసులు మోహరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దేవగట్టు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్ఠం చేసినప్పటికీ రక్తం చిందింది. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.