ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న పోలవరం నిర్వాసితుల కల నెరవేరింది. ఎప్పుడో ఏడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ , ఇతర నిధులు చెల్లించింది. తర్వాత జగన్ సర్కారు మాత్రం పట్టించుకోలేదు. తాజాగా వివిధ కేటగిరీల కింద 996.47 కోట్లను పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందచేసింది. పునరావాసం నిమిత్తం 586. 71 కోట్లు , భూసేకరణకు 235.23 కోట్లు , నిర్మాణ పనులకు 174. 53 కోట్లు సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో జమచేసింది. ఇందులో పునరావాస కాలనీల నిర్మాణ పనుల నిధులూ ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టు వల్ల తొలిదశలో ముంపులో చిక్కుకునే గ్రామాల పునరావాసంపై మొదట దృష్టిసారించారు. ఈ గ్రామాల్లో పునరావాస ప్యాకేజీ గిరిజనేతరులకు రూ.6.36 లక్షలు, గిరిజనులు, ఎస్సీలకు 6.86 లక్షలు . ఇవికాక వారి భూములు ముంపులో చిక్కుకుంటే వాటికీ పరిహారం ఇచ్చి సేకరిస్తున్నారు. ఇంటి స్థలమూ, నిర్మాణం అవసరం లేదనుకున్న నిర్వాసితులకు మొత్తం 3.85 లక్షలు చెల్లించింది. ఇంటి స్థలం కోరుకుని , తామే కట్టుకుంటామనుకునే వారికి 2.85 లక్షలిస్తోంది.
పునరావాస ప్యాకేజీ దాదాపు 5వేలకుపైగా కుటుంబాలకు దక్కినట్లు సమాచారం. పోలవరంలో తొలిదశలో మొదటి భాగం కింద 20,946 కుటుంబాలను, రెండోభాగం కింద 17,114 కుటుంబాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 7,480 కుటుంబాలు సొంతంగా ఇళ్లు కట్టుకుంటామని తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులకు 12, 157కోట్లు మంజూరు చేసింది. అడ్వాన్సుగా 2,348 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు చెల్లించిన 996.47 కోట్లు కాకుండా మరో 2,478 కోట్లు పెండింగు బిల్లులు ఉన్నాయి.
ప్రస్తుతం దాదాపు వెయ్యి కోట్లు నిర్వాసితుల ఖాతాలో జమచేసినందున అడ్వాన్సుగా మరిన్ని నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసే అవకాశం ఉంది. 2017 అక్టోబరులో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే పోలవరం నిర్వాసితుల ఖాతాల్లో భూముల పరిహారం 800 కోట్లు జమ అయింది. ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆయన సారథ్యంలోని కూటమి సర్కారు హయాంలోనే నిర్వాసితులకు న్యాయం జరుగుతోంది. ఎవరూ ఊహించని విధంగా పరిహారాలు జమవుతుండడంతో నిర్వాసిత గ్రామాలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నాయి.