ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని రోజుగా నిలిచిపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా గుర్తించాలన్నారు.
ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు
చంద్రబాబు మాట్లాడుతూ, “ఏపీ పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి 12 విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి అందించారు. ప్రధాని మోదీ సూచనలు, సలహాలతో రాష్ట్రం ప్రతికూల పరిస్థితులను అధిగమించి అభివృద్ధి దిశగా సాగుతోంది” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “మోదీ సారథ్యంలో పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. మా కూటమి ఎప్పటికీ కొనసాగుతుంది. ఢిల్లీలో ఎన్డీఏ గెలుస్తుంది. ప్రధాని మోదీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న నాయకుడు. ప్రపంచం మెచ్చే నాయకుడు మోదీ దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారు,” అని అన్నారు.
ఈ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. 5,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. సభకు విశాఖ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.
నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం రూ.1,877 కోట్ల పెట్టుబడులు.
కృష్ణపట్నంలో క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కోసం రూ.2,300 కోట్ల పెట్టుబడులు.
7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.6,177 కోట్ల పెట్టుబడులు.
3 రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం, రూ.5,718 కోట్ల వ్యయం.
విశాఖ రైల్వే జోన్ కల సాకారమై, 52 ఎకరాల భూమిని కేటాయించారు.
రూ.4,593 కోట్లతో 10 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన.
రూ.3,044 కోట్లతో 7 జాతీయ రహదారుల ప్రారంభోత్సవం.