ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతోంది. అధికారంలోకి రాగానే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కసరత్తులు చేస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. అలా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీపై ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి.
అయితే ఏపీలోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారట. దీనిని సీఎం చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం ఒకటే మిగిలి ఉందట. ఇప్పటికే ఏపీలోని జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసిన అధికారులు.. ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి వాటిని అందజేస్తున్నారు. అయితే తిరుపతి జిల్లాలో ఆర్టీసీకి ఉన్న బస్సుల సంఖ్య విషయంలోనే ఇప్పుడు అధికారుల్లో చర్చ మొదలైయ్యింది. మహిళల ఉచిత ప్రయాణం మొదలయితే.. మహిళలు ఎక్కువ సంఖ్యలో తిరుపతికి ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీంతో తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా.. ముందుగానే తిరుపతి జిల్లాలో కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనికి తోడు తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సుల కొరతతో పాటు డ్రైవర్లు, కండక్టర్ల కొరత కూడా ఉందని సంబంధిత అధికారులు ప్రాధమిక నివేదిక సిద్ధం చేసి కూటమి ప్రభుత్వానికి సమర్పించారు. వైసీపీ హయాంలో కాలం చెల్లిన బస్సులనే నడిపారని, ఇప్పుడు అక్కడ ఆ బస్సులు నడిపే పరిస్థితి లేదని తిరుపతి జిల్లా అధికారులు పై అధికారులకు సమాచారమిచ్చారు.
ఈ విషయంపై అధికారులు చర్చలు దీర్ఘంగా జరుపుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లు నియామకాలు ఎలా చేయాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి జిల్లాలో 260 మంది డ్రైవర్లు, 260 మంది కండక్టర్లు కొరత ఉందని ఓ నివేదికను పై అధికారులకు పంపించారు.
అయితే వీరందరినీ ప్రభుత్వ నియామకాలు ద్వారా అమలు చేస్తారా, లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్లను నియమిస్తారా అనేదానికి క్లారిటీ రావాల్సి ఉంది. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం 916 బస్సులు ఉండగా.. వీటిలో ఆర్టీసీకి 736 సొంత బస్సులు, 108 అద్దె బస్సులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా తిరుపతి జిల్లాకు 100 బస్సులు పైగా అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో నిలిపివేసిన రూట్లో కూడా ఇప్పుడు బస్సులు తిప్పాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి లాభాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆదాయంలో ప్రతినెల 25% ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వమే తీసుకునేది. అయితే ఆర్టీసీ ఆదాయం తీసుకోకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మహిళలు ఉచితంగా ప్రయాణించడంతో అయ్యే ఖర్చు..ఏపీ ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందని అందువల్ల ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గరకు వచ్చిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి.. కొన్ని లెక్కలు తేలగానే సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు హామీ పథకం గురించి వెల్లడిస్తారని అంటున్నారు.