నేడు టీడీపీలోకి ఆళ్లనాని

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది అవకముందే..వైసీపీ నేతలంతా ఆ పార్టీకి పెద్ద ఎత్తున గుడ్ బై చెబుతున్నారు. ఇన్ని రోజులు టీడీపీ, జనసేన నేతలే ఇప్పుడు కూటమి పార్టీకి జై కొడుతూ పార్టీలో చేరుతున్నారు. కానీ అప్పట్లో అలా ఇబ్బంది పెట్టిన నేతల విషయంలో మాత్రం కూటమి శ్రేణుల్లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

అలాగే మాజీ మంత్రి ఆళ్ల నాని విషయంలోనూ మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం అయినా చివరకు టీడీపీలో చేరడం ఖాయమైంది. నిజానికి ఆళ్ల నాని చాలా రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసినా.. టిడిపిలో వచ్చేందుకు ఏలూరు అసెంబ్లీ స్థాయిలో పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం దృష్ట్యా నాని చేరికకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు అభ్యంతరం వ్యక్తం చేసిన ఏలూరు టీడీపీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణులు కూడా సీఎం సూచనలతో సమ్మతించాయి. హై కమాండ్ నిర్ణయమే శిరోధార్యం అంటూ ప్రకటించడంతో.. ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.

నిజానికి వైసీపీలో ఆళ్ల నాని ఒక వెలుగు వెలిగారు . 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన అతనికి జగన్ తన మంత్రివర్గంలో చాన్స్ కూడా ఇచ్చారు . మంత్రి పదవి ఇవ్వడంతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాను కట్టబెట్టారు.అయితే మంత్రివర్గ విస్తరణలో నానిని తప్పించారు. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు.

దీంతో జగన్ ఆళ్లనానికి ఏలూరు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయినా సరే పెద్దగా ఆసక్తి చూపని ఆళ్ల నాని.. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను వదులుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి.. అప్పటినుంచి పొలిటికల్ డిఫెన్స్ లోనే ఉన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఆళ్లనాని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లో తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు.2009లో కూడా రెండోసారి గెలుపొందారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేసిన ఆయన.. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా జగన్ ఆళ్లనానికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.

2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి మరోసారి పోటీ చేసిన ఆళ్ల నాని విజయం సాధించి.. జగన్ క్యాబినెట్లో మంత్రి తో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా రెండున్నర ఏళ్లపాటు కొనసాగారు. ఈ ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలనుంచి తప్పుకోవాలని అనుకున్నా..చివరకు ఇప్పుడు తన మనసు మార్చుకుని టీడీపీలో చేరుతున్నారు.