ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది. అమరావతి కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసిన పలు అభ్యర్ధనలను కేంద్రం ఆమోదించడంతో.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి 15 వేల కోట్ల రూపాయల రుణం పైన ఒప్పందాలు జరిగాయి. జనవరి నుంచి నిర్మాణాల దిశగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వానికి ఆర్దికంగా భారం తగ్గించేలా కేంద్రం నుంచి మరో హామీ దక్కింది. దీంతో, ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కనుంది.దీనివల్ల రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టంగా ఇది మారనుంది.
అమరావతిలో కీలకమైన బైపాస్ ప్రాజెక్టుల భూ సేకరణ ఖర్చును భరించడానికి కేంద్రం అంగీకరించింది. దీనిపై కూటమి ప్రభుత్వం చేసిన అభ్యర్ధనకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. అమరావతిలో ఔటర్, తూర్పు బైపాస్ రోడ్ భూ సేకరణ ఖర్చును కేంద్రం భరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. 189 కి.మీ పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు .. 59 కి. మీ. తూర్పు బైపాస్ రోడ్ల నిర్మాణం కోసం వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీని కోసం సుమారుగా 6 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. అయితే ప్రస్తుతం ఏపీకి ఉన్న ఆర్దిక సమస్యలతో ఈ మొత్తం ఖర్చును భరించడం భారంగా మారడంతో, ఈ ఖర్చును కేంద్రం భరించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం చంద్రబాబు కలిసి దీనిపై విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీ – కేంద్ర అధికారుల మధ్య జరిగిన చర్చలతో బైపాస్ నిర్మాణం కోసం భూ సేకరణ ఖర్చు తామే భరిస్తామని ఎంవోఆర్‌టీహెచ్ చెప్పింది. అయితే, ఈ ఒప్పందంలో భాగంగా తమకు స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరగా దీనికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. స్టేట్ జీఎస్టీని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఔటర్ బై పాస్ భూ సేకరణ కోసం 4 వేల కోట్ల రూపాయలు.. తూర్పు బై పాస్ భూ సేకరణ కోసం 2 వేల కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా వేయగా. . ఇప్పుడు కేంద్రం ఈ ఖర్చుకు అంగీకరించటంతో ఏపీ ప్రభుత్వానికి 6 వేల కోట్ల రూపాయల మేర రిలీఫ్ దక్కినట్లు అయింది.
గతంలోనే ఏపీ ప్రభుత్వం అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం భారత్ మాల ఛాలెంజింగ్ ప్రోగ్రాం కింద చేర్చాలని కోరగా.. అప్పట్లోనే భూ సేకరణ ఖర్చు సగం భరించాలని కేంద్రం షరతు విధించింది. అయితే తాజాగా రాజధాని నిర్మాణం కోసం సిద్దం చేసిన అంచనాల్లో అమరావతి ఔటర్ కోసం 26 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ఇప్పుడు రహదారి నిర్మాణంతో పాటు భూ సేకరణకు కూడా కేంద్రం ముందుకు రావటంతో ఇక ఈ నిర్మాణం వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం స్టేట్ జీఎస్టీ మినహాయింపుతో భూ సేకరణ పైన త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుందని అధికారులు వెల్లడించారు.