అమరావతికే పట్టం అని మరోసారి తేల్చి చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో కూడా రాజధాని అమరావతికి తిరుగులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీని కోసం పార్లమెంటులో చట్టం చేయిస్తామని హామీ ఇచ్చారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో గతంలో చట్టం కుదరలేదన్న సీఎం చంద్రబాబు..ఇప్పుడా సమస్య లేదని వివరించారు. మే 2న ప్రధాని మోదీ పర్యటన కోసం తాజాగా రాజధాని రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి..రాజధాని అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
గతంలో అమరావతి విషయంలో జరిగిన పొరపాట్లు ఏవీ కూడా ఈ కూటమి ప్రభుత్వ హయాంలో రిపీట్ కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. దీనికోసం పక్కాగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్పార్సీపీ ప్రభుత్వం..అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు. కానీ ఇంచు కూడా ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టలేదు. మరోవైపు వైసీపీ పనులతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులంతో రోడ్డెక్కి.. ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
గతంలో జరిగిన ఇలాంటి పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబు ఇకపై అలాంటి ఇబ్బందులేమీ కూడా తలెత్తకుండా ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని ఆ ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. అలాగే రాజధాని భూసమీకరణపై కూడా రైతుల అనుమానాలను సీఎం తీర్చారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా తాము నెరవేరుస్తామని.. అభివృద్ధి అవసరాల వరకే తదుపరి భూ సమీకరణ ఉంటుందని సీఎం క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ప్రస్తుతం ఇస్తున్న కౌలుతో అవసరాలు తీరడం లేదని గ్రహించిన సీఎం అక్కడి రైతులకు మరింత సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.అలాగే రైతులతో భేటీలో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయంపైన కూడా చర్చించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా అభివృద్ధి చెందాలంటే సిటీ విశాలంగా ఉండాలన్నారు. అప్పుడు అమరావతికి పెట్టుబడులు వస్తాయని.. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే కలిగే ప్రయోజనాలను కూడా చంద్రబాబు రైతులకు వివరించారు.