ఓ వైపు తిరుమల తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతంటే ఇప్పుడు మరో అంశంతో టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కనిపించింది. అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టీటీడీ యాజమాన్యాన్ని భక్తులు ప్రశ్నించారు. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా అక్కడ్నుంచి భక్తులను వెళ్లిపోమన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయమే తిరుమలకు వచ్చే భక్తులతో నడవడిక, అన్నదానంపై టిటిడి అధికారులను సీఎం చంద్రబాబు హెచ్చరించిన గంటల వ్యవధిలో ఇది జరిగింది.
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ అనే విషయంపై టీటీడీ స్పందించింది. శ్రీవారి అన్న ప్రసాదంలో జెర్రీ వచ్చిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం అని, వదంతులను ఖండించారు. మాధవ నిలయంలోని తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టిటిడి అన్నప్రసాదాలను తయారుచేస్తుంది. అంత వేడిలో కూడా ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని భక్తుడు చెప్పడాన్ని మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని కలియపెట్టిన తరువాత పెరుగు కలుపుతారు. అలాంటప్పుడు జెర్రి ఏమాత్రం రూపు చెదరకుండా ఉంది అనేది.. కావాలని చేసిన చర్యగా అందరూ భావించాల్సి వస్తుంది. కనుక భక్తులు దయచేసి ఇలాంటి అవాస్తవాలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
లడ్డూ ప్రసాదంలో గుట్కా కవర్లు
ఇటీవల లడ్డూ ప్రసాదంలో కూడా గుట్కా ప్యాకెట్లు వచ్చినట్లు భక్తులు ఆరోపించిన విషయం తెలిసిందే. గత నెల 19వ తేదీన ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీవారి భక్తులు తిరుమల వెళ్లి వచ్చారు. ఆ తర్వాత లడ్డూ ప్రసాదాలను పంచే క్రమంలో ఓ లడ్డూలో గుట్కా కవర్లు, పలుకులు వచ్చినట్లు భక్తులు ఆరోపిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో పై స్పందించిన టీటీడీ ఇలాంటి అవాస్తవాలను నమ్మొద్దని భక్తులను కోరింది. తాజాగా అన్నదాన కేంద్రంలోనే జెర్రి కనిపించటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
వీఐపీ సంస్కృతి పై చంద్రబాబు సూచన
అంతకముందు తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించాలని ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. తిరుమలలో ప్రముఖులు పర్యటించే సమయంలో హడావుడి అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలలో శనివారం నాడు శ్రీ వకుళ మాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను చంద్రబాబు ప్రారంభించారు. తిరుమలలో ఆధ్యాత్మికత ఉట్టిపడే పరిసరాలు ఉండాలని టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి సీఎం చంద్రబాబు సూచించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో చంద్రబాబు సమీక్షలో టీటీడీ అధికారులకు కీలక సూచనలు చేశారు.