తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్‌ కసరత్తు..

AP Budget Exercise Reaches Final Stage, AP Government, Chandrababu, Payyavula Keshav, 2025-26 AP Budget, AP Budget, Agriculture Funds, Andhra Pradesh Assembly, AP Budget 2025-26, Polavaram Project, Welfare Schemes, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Telangana, TS Live Updates, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఏపీ ప్రభుత్వ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఏపీ GSDP వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడం ఈ బడ్జెట్‌ ముఖ్య లక్ష్యం. దీని కోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తమ పథకాల అమలుకు ఏపీ ప్రభుత్వం తగినంత నిధులు కేటాయించడంతో పాటు వాటి ఆర్థిక ప్రభావాన్ని సమీక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుకు పెద్దపీట వేస్తోన్న కూటమి ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఫోకస్ పెట్టింది. వీటిలో కొన్నిటిని ఇప్పటికే అమలు చేస్తుండగా.. మరికొన్నిటిని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించింది. ఏపీలో ఆర్థిక లోటు ఉన్నా, సంక్షేమ పథకాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

రాజధాని అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం మూడేళ్లలో 60వేల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతిని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి 30 కోట్ల రూపాయలకు పైగా రుణాలకు హామీ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సందర్భంగా ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ ఇవ్వనుంది.

పట్టణ పునరుద్ధరణ ప్రాజెక్టులు, మెరుగైన రోడ్డు కనెక్టివిటీ, పరిశ్రమల అభివృద్ధి, పునరుత్పత్తి శక్తి రంగాల్లో పెట్టుబడులు బడ్జెట్‌లో ముఖ్య ప్రాధాన్యత పొందనున్నాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో.. డిజిటల్ గవర్నెన్స్, ఐటీ హబ్‌ల డెవలప్మెంట్, తయారీ పరిశ్రమల వృద్ధి వంటి రంగాల్లో ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ, ఏపీ బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు, ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం వంటి అంశాలు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక శాఖకు 28 శాఖల బడ్జెట్ సమీక్షలు పూర్తి అవడంతో, మంత్రులంతా తమతమ శాఖలకు అధిక నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఒక్క ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ మాత్రమే రూ.37వేల కోట్ల రూపాయలు కోరగా, ప్రభుత్వం 27వేల కోట్లు రూపాయలు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం నేతృత్వంలోని ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోయే ఈ పూర్తి స్థాయి బడ్జెట్, ఏపీ ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచేలా, సంక్షేమం, మౌలిక వసతుల డెవలప్మెంట్, పరిశ్రమల పెట్టుబడులకు సమతుల్యత కల్పించేలా ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.