ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 4న ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఆర్టీసీ కార్మికుల విలీనం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకునేందుకు కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంజనేయరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చలు జరిపింది. వీటి ఆధారంగా విలీన నిర్ణయం తీసుకుని ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.
విలీనంపై రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే పక్రియ ఇక వేగవంతం కానుంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన అనంతరం 15 రోజుల్లో పూర్తి స్థాయి విధివిధానాలు రూపొందించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఆర్టీసీలో ఉన్న సుమారు 53వేల మంది పదవి విరమణ వయస్సు 60 సంవత్సరాలకి పెరగనుంది. ఈ విలీనం వలన ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. 3,300 కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు కొత్త ఇసుక విధానానికి కూడ ఆమోదముద్ర వేసి రేపటినుంచి అమల్లోకి వచ్చేలా చేసారు. ఇసుక ధరను ఒక టన్నుకు రూ.375 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండిపీ ద్వారా ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
[subscribe]
[youtube_video videoid=APggLv2rilA]