నేడు లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు

AP CM Chandrababu To Leave For London With Wife Bhuvaneswari Today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే మూడు రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిరాగానే, మొంథా తుఫాన్ పర్యవేక్షణలో బిజీబిజీగా గడిపిన సీఎం చంద్రబాబు, తాజాగా మరో పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే, ఈసారి ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఈరోజు (శనివారం) రాత్రి లండన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. నవంబర్ 6వ తేదీ వరకు ఆయన అక్కడే ఉండనున్నారు.

అవార్డుల స్వీకరణ:

కాగా, ఈ పర్యటనలో ఆయన వెంట సతీమణి నారా భువనేశ్వరి కూడా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, నవంబర్ 4వ తేదీన లండన్‌లో జరిగే అవార్డుల కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొననున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మరియు హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ అయిన భువనేశ్వరి, ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు-2025’తో పాటు ‘ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌’లో భాగంగా ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును కూడా స్వీకరించనున్నారు.

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం:

అయితే, వ్యక్తిగత పర్యటనతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు లండన్ లో పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) కు హాజరు కావాలని లండన్‌లోని పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులను ఆయన ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here