ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం

AP CM, Deputy CM In Delhi Election Campaign

ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కాగా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.గతంలో కంటే ఇప్పుడు ఏపీసీఎం చంద్రబాబు విషయంలో బీజేపీలో మార్పు కనిపిస్తోంది. జాతీయస్థాయిలో అన్ని అంశాల్లో కూడా ఏపీ సీఎంకు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు కేంద్ర పెద్దలు. ఎన్డీఏ పరంగా కూడా బాధ్యతలను అప్పగిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా సీఎం చంద్రబాబు ప్రచారం చేయడానికి సిద్ధపడగా.. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అకాల మరణంతో తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది.

అయితే ఈసారి సీఎం చంద్రబాబుకు ఢిల్లీ పెద్దలు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఆహ్వానించడంతో..బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1 ఢిల్లీలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సీఎం చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. దీనికోసం తెలుగు అసోసియేషన్ అన్ని ఏర్పాట్లును పూర్తి చేస్తోంది.

ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో అదే స్థాయిలో అభ్యర్ధుల ప్రచారాలు జోరందుకున్నాయి. ఢిల్లీలో తెలుగు వారి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అక్కడ సుమారు పది లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. తెలుగువారు ఎక్కుగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయాలని పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా..ఈసారి ఢిల్లీలో పోరు హారాహోరీగా ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి రేగుతోంది.

ఢిల్లీలో ఆప్ ఆధి పత్యానికి గండి కొట్టాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు… ఎలాగైనా ఢిల్లీలో పార్టీ జెండా పాతాలని చూస్తోంది. దీనికోసం ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకూడదని భావిస్తోంది. అందుకే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయాలని నిర్ణయించి వారిద్దరికీ ఆహ్వానాలు పంపింది. గత రెండు ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడమే కాకుండా.. ఆ పార్టీ పంజాబ్ కు కూడా విస్తరించింది. ఈ తరుణంలోనే ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన వాయిస్ మరింత పెంచుతున్నారు. బీజేపీ తీరును ఎండ కడుతున్నారు. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికలలో ఢిల్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచిచూడాలి మరి.