ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 4, శనివారం సాయంత్రానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి పెరిగినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఢిల్లీలోని మర్కజ్ సమావేశానికి వెళ్లిన వారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకడం దురదృష్టకరమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో అయినా ఇలాంటివి జరగొచ్చని ఈ క్రమంలో ఇలా వైరస్ సోకడాన్ని అనుకోని ఘటనగానే భావించాలని అన్నారు. కరోనా వైరస్ కాటుకు కులం మతం, ప్రాంతం, పేదా, ధనిక, తేడా లేదని పేర్కొన్నారు. కంటికి కనిపించని శత్రువుతో మనమంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా సోకిన వారిని తప్పు చేసినట్లుగా చూపించవద్దని సీఎం వైఎస్ జగన్ కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన మేరకు రేపు (ఏప్రిల్ 5, ఆదివారం) రాత్రి 9 గంటలకు లైట్స్ ఆపుచేసి 9 నిమిషాల పాటు ప్రతి ఒక్కరు దీపాలు, క్యాండిల్స్, టార్చిలైట్, సెల్‌ఫోన్‌లైట్ లను వెలిగించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. మనం ఇచ్చే ఈ సంకేతం గొప్ప ఆదర్శంగా ఉంటుందని, రాత్రి 9 గంటలకు వెలిగించే దీపాలు మన సమైక్యత చాటాలని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాన్ని రెండు విడతలుగా చెల్లించాలని నిర్ణయించినప్పటికీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యా-ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.