
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పింఛన్ల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలు విధిగా పాల్గొనేలా చంద్రబాబు ఆదేశించారు. ఆరోజు ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కనబెట్టి ఒకటో తేదీ జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా మంత్రులందరూ నెలలో ఒక్కసారైనా వారి జిల్లాల్లో ఉన్న టీడీపీ ఆఫీసులను సందర్శించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఐదేళ్లు మాత్రమే కాకుండా మరి కొన్నేళ్ల పాటు ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రజలకు, నాయకులకు మధ్య బలమైన సంబంధాలు ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వంపైన కాకుండా పార్టీపైన కూడా చంద్రబాబు దృష్టిపెడుతున్నారు. ప్రతి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని తప్పకుండా సందర్శిస్తున్న సీఎం.. ముఖ్యనేతలతో సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా నేతలతో చర్చిస్తున్నారు.
దీనిలో భాగంగనే చంద్రబాబు పింఛన్ల పంపిణీపై కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు. ఏపీలో ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ జరగగా.. జులై 1న టీడీపీ కూటమి ప్రభుత్వం, సీఎంతో పాటు కూటమి నేతలంతా కలిసి సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటివద్దనే పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.
జులైలో తొలిసారిగా పింఛన్లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. ఒక్కరోజులోనే లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం తొలి రోజే 94 శాతం మందికి పెన్షన్లను అందించారు. ఇప్పుడు ఫస్ట్ తేదీ సమీపించడంతో.. ఆగస్టు నెల పింఛన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఆగస్ట్ నెల ఒకటే కాకుండా ఇక నుంచి పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలకు కూడా పాల్గొనాలని చంద్రబాబు చెప్పారు.
పాలనాపరంగా, పర్సనల్ పనులు ఎన్ని ఉన్నప్పటికీ ప్రతి నెలా ఒకటో తేదీన తమ నియోజకవర్గాల్లో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో నేతలెవరూ ఎలాంటి సాకులు చెప్పొద్దని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా తామున్నామంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న పార్టీ ఆఫీసులను నెలలో ఒక్కసారైనా వెళ్లి కార్యకర్తల కష్టాలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి.. వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడటానికి ప్రయత్నించాలని సీఎం సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE