కేంద్రానికి ఏపీ సీఎం స్పెషల్ రిక్వెస్ట్..!

AP CM's Special Request To The Center

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు తీపికబురు చెబుతున్నారు. ఏపీలో పేదవాళ్ల కోసం ఏకంగా 10 లక్షల ఇళ్లు నిర్మించాలనుకుంటున్న సీఎం.. ఈ మేరకు కేంద్రానికి రిక్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో సంబంధితశాఖ మంత్రిని నేరుగా కలిసి కానీ.. లేఖ ద్వారా కానీ కోరబోతున్నారు. నిజానికి ఇటీవల ఢిల్లీ పర్యటనలోనే వారిని కలవాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో కుదరలేదు. దీనిపై త్వరలోనే కేంద్రాన్ని చంద్రబాబు రిక్వెస్ట్ చేయనున్నారు.

పీఎంఏవై-2.0 ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో పేదల గృహ నిర్మాణానికి సంబంధించి..ఏపీకి 10 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. దీనిపై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది.

గతేడాది డిసెంబరులో దీనిపై సర్వే ప్రారంభించగా.. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కూడా సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకోవడానికి మంజూరు కోసం దరఖాస్తు చేసిన వారే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా మొత్తం 3మందికి లక్షల మంది ఉంటారని అంచనాలు ఉన్నాయి. అయితే లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. కాగా.. అన్నీ కలిపి మరో 5 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గృహనిర్మాణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో సీఎం చంద్రబాబు మొత్తంగా 10 లక్షల గృహాలు అవసరమని కేంద్రానికి నివేదించనున్నారు.

ఇప్పటికే తొలి విడతగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం ఏపీకి 50 వేల గృహాలు మంజూరు చేసింది. వీటికి సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియను కూడా అధికారులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వివరాలతో డీపీఆర్‌ సిద్ధం చేసి.. ఫిబ్రవరి నెలాఖరుకల్లా కేంద్రానికి పంపనున్నారు. ఆ తర్వాత వీటికి సంబంధించిన నిధులు మార్చిలో కేంద్రం నుంచి విడుదల అవుతాయని చెబుతున్నారు.

మరోవైపు ఏపీలోని రహదారుల్లో గుంతలు పూడ్చే పనులు 90 శాతం వరకూపూర్తయ్యాయి.. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో సమీక్ష కూడా నిర్వహించారు. ఫిబ్రవరి ఎండింగ్‌కు 100 శాతం మరమ్మతులు పూర్తవుతాయని ఇంజినీర్లు వివరించారు. అనంతరం న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ రుణంతో చేపడుతున్న రోడ్డు విస్తరణ, నాబార్డ్‌ నిధులతో మంజూరు చేయాల్సిన రోడ్లపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్షించారు.