ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ-2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్యర్థులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. డీఎస్సీ-2018 పై పెండింగ్లో ఉన్న కేసును కోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ రోజు మంత్రి మాట్లాడుతూ, డీఎస్సీ-2018 ఎస్జీటీ కేటగిరీలో 3524 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇప్పటికే 2203 మంది అభ్యర్థుల రికార్డ్స్ వెరిఫికేషన్ పూర్తయిందని, మిగతా 1321 మంది వెరిఫికేషన్ ఈ రోజుతో పూర్తవనుందన్నారు. బుధవారం నాడు అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం ఇస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 24న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో ఇతర నియామక ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ 26న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు మంత్రి సురేష్ వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తున్నామన్నారు. అలాగే డీఎస్సీ-2018 కు సంబంధించి స్కూలు అసిస్టెంట్స్ భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ-2020 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. టెట్ సిలబస్ కూడా విద్యార్ధుల అవసరాల మేరకు మార్పులు చేసి తయారుచేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu