చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీలోని అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. తాజాగా అర్చకుల వేతనాన్ని 15 వేల రూపాయలకు పెంచింది. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని 5 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలకు పెంచుతూ ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా ఆలయాల కళ్యాణకట్టలో పని చేసే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం 25 వేల రూపాయలు ఉండేలా చర్యలు చేపడుతోంది.
మరోవైపు దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలపైన కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. దేవాలయాల ఆస్తులను పరిరక్షించడానికి త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేయనుంది. అలాగే ఆధ్యాత్మిక పర్యటక అభివృద్ధిపైన కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ వేయడానికి సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
మరోవైపు దేవాలయాల్లో ఇక నుంచి ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాదాయశాఖాధికారులకు ఆదేశించారు. దేవాలయాల దగ్గర ఎటువంటి బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని..అలాగే అన్యమతస్థుల ప్రచారం చేయకూడదని ఆదేశాలు జారీ చేశఆరు.
అంతేకాకుండా..హిందూ భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యతతో పాటు ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఇటు కూటమి సర్కార్ నిర్ణయంతో తమకు.. వేతనం పెరగడం పట్ల అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అంటున్నారు.