కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ల కోసం ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీలో వచ్చే సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హత కలిగిన వారికి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
అందులో భాగంగా కొత్తగా వివాహం చేసుకున్న జంటలతో పాటుగా ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలను అనుగుణంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రీ డిజైనింగ్ చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసి కొత్తగా అందరికీ కొత్త డిజైన్ తో కార్డులు అందించనున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే కొత్త కార్డుల డిజైన్ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ సర్కార్ లేత పసుపు రంగులో కొత్త రేషన్ కార్డుల డిజైన్‌ను ఖారారు చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. డిజైన్‌పై తుది నిర్ణయం తర్వాత కొత్త కార్డులు రానున్నాయి.
కొత్త కార్డులు, కార్డ్ స్ల్పిట్, కొత్తగా పేరు చేర్చడం ఇలా పలు రకాలుగా చాలా మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. చాలా అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డు సమస్యలు తొలిగిపోయే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా, వాటిల్లో 90 లక్షల కార్డులను జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించారు. వీటికి ఉచిత బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరుకులపై రాయితీ అందుతోంది. మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు తదితర సరుకులు అందుతున్నాయి. వీటిపై ఇస్తున్న సబ్సిడీకి అయ్యే ఆర్థిక భారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో, ప్రభుత్వం పై అదనపు భారం పడకుండా కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన అధికారుల యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
జనవరిలో జన్మభూమి -2 ప్రారంభానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఆ సమయంలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.