ఏపీలో పోస్టాఫీసులకు రద్దీ గణనీయంగా పెరిగిపోతుంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు ఈసారి బ్యాంకు ఖాతాలకు బదులు పోస్టాఫీసు ఖాతాల్లో జమ అవుతాయని వచ్చిన పుకార్లతో జనం మూడు రోజులుగా పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాస్తవంగా, కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ మినహా ఇతర సంక్షేమ పథకాల డబ్బులు ఇప్పటికీ ఖాతాల్లో జమ చేయడం లేదు. ఈ విషయం పై చర్చ జరుగుతుండగానే కొత్త పుకార్లు మొదలయ్యాయి.
ఈ మధ్యకాలంలో, బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం మారిన తరువాత తమకు సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయో లేదో అనే ఆందోళనతో, పథకాలు అందుకుంటున్న కొంతమంది ప్రజలు కూడా పోస్టాఫీసులలో ఖాతాలు తెరవడం ప్రారంభించారు. ఈ సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఇచ్చే పథకాల డబ్బుల కోసం ఖాతాలు తెరిచేస్తున్నవారు, కేంద్ర ప్రభుత్వం మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వనుందనే పుకార్లతో మరికొందరు కూడా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవడం ప్రారంభించారు.
పోస్టాఫీసుల్లో అకౌంట్ తెరవడానికి కేవలం 200 రూపాయల డిపాజిట్ మాత్రమే కావడంతో, కొత్తగా ఖాతాలు తెరిచే వారికి ఏ పరిస్థితిలోనూ నష్టం ఏమీ లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే, పోస్టాఫీసులకు ఉన్న రద్దీ మరింత పెరిగింది. ఈ రద్దీ పెరగడం వలన, పోస్టల్ శాఖపై ఒత్తిడి మరింత పెరిగింది. పెద్ద సంఖ్యలో జనం రోజు రోజుకూ కొత్త ఖాతాలు తెరవడానికి పోస్టాఫీసులకు తరలిపోతున్నారు, దీనిపై కేంద్రం కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఇక, బ్యాంకు ఖాతాలు ఉన్నవారు, ఆధార్ లింక్ చేసిన వారు కొత్త ఖాతాలు తెరచుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. వారు ఇప్పటికే పథకాలకు సంబంధించిన డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పొందుతున్నారని తెలిపారు. కానీ, ఆధార్ లింక్ కాని లేదా బ్యాంకు ఖాతా లేని వారు మాత్రమే పోస్టాఫీసు ఖాతాలు తెరవాలని అధికారులు సూచిస్తున్నారు.