ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిలిపివేతకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం మెయిన్ ఎగ్జామ్ జరగకపోతే అర్హులైన అభ్యర్థులందరి ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని, అందుకే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. మెయిన్స్ పరీక్షకు 92వేల250 మంది అర్హత సాధించారని, అందులో కేవలం ఇద్దరు మాత్రమే హారిజంటల్ రిజర్వేషన్‌పై అభ్యంతరం తెలుపుతూ పరీక్షలు నిలిపి వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేసింది. ఒకవేళ పిటిషనర్లు ఈ కేసులో విజయం సాధిస్తే, అప్పుడు మొత్తం పరీక్షా ప్రక్రియను మొదటి నుంచి తిరిగి ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. అంతేకాకుండా మెయిన్స్ ఎగ్జామ్ ను నిలిపి వేస్తే చాలా మంది అభ్యర్థులకు తీరని నష్టం కలుగుతుందని అందుకే ఈ పరీక్షను నిలుపుదల చేయలేమని పేర్కొంది.
అయితే ఈ కేసుల్లో వెలువరించే తుది తీర్పునకు లోబడే.. నియామకాలు కూడా ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో 10 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం..తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో.. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు అన్ని అడ్డంకులు కూడా తొలగి పోయినట్లైంది. మరోవైపు ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో 175 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను నిర్వస్తున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే కనుక వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్ 1 రాత పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది.
అభ్యర్థులు ఉదయం అరగంట ముందే అంటే 9.30 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 9.45 గంటలకు గేట్లను మూసివేస్తారని అధికారులు చెబుతున్నారు. అలాగే మధ్యాహ్నం సెషన్లో 2.30 గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు అభ్యర్ధులు చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చిన ఎవరినీ కూడా లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇటు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలను విధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.