ఏపీలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయని..దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో.. అవసరం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని కూటమి నేతలు ప్రకటించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవడంతో.. కొత్త జిల్లాల ఏర్పాటు పై దృష్టి పెట్టాలన్న విజ్ఞప్తులు ఎక్కువ అవుతున్నాయి.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రంపచోడవరం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరడంతో.. సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రంపచోడవరంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గం కలవడం వల్ల అక్కడివారు అసౌకర్యానికి గురవుతున్నారని రంపచోడవరం నుంచి పాడేరు కలెక్టరేట్ కు వెళ్లాలంటే 500 కి.మీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని.. అందుకే ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
మరోవైపు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై కూడా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కామెంట్ చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడం ఖాయమని..దీనిపై మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీతో మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తారని చెప్పుకొచ్చారు. నిజానికి మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీనిపై కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. త్వరలో దీనికి సంబంధించి ప్రకటన రావచ్చొని తెలుస్తోంది.
వైసీపీ హయాంలో 13 ఉమ్మడి జిల్లాలను.. 26 జిల్లాలుగా విభజించడంతో.. అప్పట్లో జిల్లాల విభజన హేతుబద్ధంగా జరగలేదన్న ఆరోపణలు వచ్చాయి. పైగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల విభజన చేయలేదన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఎన్నికలకు ముందు కూటమి జిల్లాల ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో.. అవి ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. వాటి విషయంలో ఏదొక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వంపై ఏర్పడింది. అయితే ఇప్పటివరకు రెండు జిల్లాల ఏర్పాటుపై మాత్రమే డిమాండ్ మాత్రమే ఉంది. కొన్ని జిల్లాల్లో మండలాల సర్దుబాటు, నియోజకవర్గాల సర్దుబాటు విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉండటంతోత వీటిపైన కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది.