తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరనున్నారు. అయితే ముందుగా బలప్రదర్శన చేసి, అనుచరగణంతో ఘనంగా పార్టీలో చేరాలని బాలినేని భావించినా కూడా… దానికి జనసేన అధిష్ఠానం ఓకే చెప్పలేదు.ర్యాలీకి అనుమతి కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో జనసేన పార్టీలో చేరికపై బాలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా జనసేన అధిష్టానం నుంచి ఎటువంటి మార్పు లేకపోవడంతో బాలినేని మెట్టు దిగక తప్పలేదు. చేసేది లేక నిరాడంబరంగా ఒక్కరే పార్టీలో చేరడానికి సన్నద్ధమయ్యారు.
మొదట జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఒంగోలుకు రప్పించి బలప్రదర్శన నిర్వహించి, అనుచరగణంతో పవన్ సమక్షంలో పార్టీలో చేరాలని బాలినేని అనుకున్నారు. అయితే బాలినేని శ్రీనివాస రెడ్డి చేరికపై కూటమిలో వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ..పార్టీ మారినా గత పాపాల నుంచి తప్పించుకోలేరంటూ బాలినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలినేనిని సైలెంట్‌గా పార్టీలో చేర్చుకోవాలని ఇటు పవన్ కల్యాణ్ భావించారు. దీంతోనే ఒంగోలులో సభ అవసరం లేదనీ, బాలినేని ఒక్కరే మంగళగిరి వచ్చి చేరాలంటూ జనసేన అధిష్ఠానం కబురుపంపింది. ఆయనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా జనసేన పార్టీలో చేరతారని ప్రకటించింది.
దీంతో మాజీమంత్రి చేరిక అనేది ప్రత్యేక కార్యక్రమం కాదు అన్నది స్పష్టమైంది. దీనికి అనుగుణంగానే బాలినేని ఒక్కర్నే పార్టీలో రావాలని కోరారు. ఊహించని పరిణామంతో డీలా పడిన మాజీ మంత్రి శిబిరం..ఒకానొక దశలో చేరికను వాయిదా వేద్దాం అన్నట్లుగా నిర్ణయం తీసుకుందున్న ప్రచారమూ సాగింది. అయితే కినుక వహించినా కూడా పరిస్థితిలో మార్పులేకపోవడంతో చివరకు బాలినేని మెట్టు దిగిరాక తప్పలేదు. తాను చేరాక మిగతా వారినీ కూడా పవన్‌కల్యాణ్ సమక్షంలోనే జనసేనలో చేరుస్తానని క్యాడర్‌తో బాలినేని చెప్పడంతో..ఆయనతో పాటు ఈ రోజు వైసీపీ కీలక నేతలు పార్టీలో చేరనున్నారు. సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య కూడా ఈరోజు జనసేనలో చేరుతున్నారు. వీరితో పాటు, కొంతమంది వైసీపీ నేతలు సైతం జనసేనలో చేరుతారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.