ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈనెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం ఉంది. దీంతో 23వ తేదీవరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అనకాపల్లి, కోనసీమ, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల బలమైన ఉపరిత గాలలు వీస్తాయని అంచనా వేసింది.
వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి 24వ తేదీ వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అంతేకాకుండా ఏపీలో రానున్న మూడురోజులు బలమైన గాలులు వీస్తాయి. ఈరోజు అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మోస్తారు వానలు పడతాయి. గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశం ఉంది.
ఇక తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 23వ తేదీన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.