ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా.. కోళ్లకు, కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్. తొలిసారిగా ఇండియాలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్ అనే ఊరిలోని పౌల్ట్రీ ఫామ్‌లో బైటపడింది. అప్పటినుంచి ఏటా దేశంలో బర్డ్‌ఫ్లూ అలారం మోగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, బెంగాల్, ఒడిషా, జార్ఖండ్లో.. దాదాపు 25 సీజన్లలో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా విరుచుకుపడింది . ఇంతవరకూ బర్డ్‌ఫ్లూ భయంతో 90 లక్షల కోళ్లు వధకు గురయ్యాయి. వాటితో పాటు పౌల్ట్రీ రంగానికి వేల కోట్లలో నష్టాలు చోటుచేసుకుున్నాయి. లేటెస్ట్‌గా మళ్లీ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ మహమ్మారి మోత మోగిస్తోంది.
దీంతో ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. పౌల్ట్రీ ఫామ్ చుట్టుపక్కన కి.మీటరు దూరం వరకు రెడ్‌జోన్‌గా.. పది కిలోమీటర్లు సర్విలెన్స్ జోన్‌గా ప్రకటించింది. అంతేకాదు బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలిన కోళ్లను బతికుండగానే పూడ్చిపెట్టడంతో పాటు కోడిగుడ్లనూ నిర్మూలించాలని ఆదేశాలొచ్చేశాయ్. పూడ్చిపెట్టే ఒక్కో కోడికి 90 రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం పరిహారం కూడా అందిస్తోంది ప్రభుత్వం. సాధారణంగా ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల లోపు ఉంటేనే బర్డ్‌ఫ్లూ వైరస్ బతికుంటుంది. ప్రస్తుతం సగటున 34 డిగ్రీల పైనే నమోదౌతోంది కనుక.. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నియంత్రణలో ఉంటుందనే నిపుణులు చెబుతున్నారు. కాకపోతే కొన్నిరోజుల పాటు చికెన్‌కు దూరంగా ఉండడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఒకవేళ చికెన్ వండుకుంటే మాత్రం దానిని 160 ఫారన్ హిట్‌లో వండుకోవాలి.చికెన్ కడిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. హాఫ్ బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్ అస్సలు తినకూడదు. గ్రిల్డ్ చికెన్ , ఉడికీ ఉడకని చికెన్ జోలికి పోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు..కోళ్ల నుంచి మనకే కాదు.. జంతువులకు కూడా బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదముందట. ఇళ్లలో పెంచుకునే పిల్లులు, కుక్కలతో కూడా అంటీముట్టనట్టు ఉండాలంటున్నారు.మొత్తానికి చికెన్ కొత్త పరేశాన్ తెచ్చిందని నాన్ వెజ్ లవర్స్ ఫీలవుతున్నారు.