మహిళా బిల్లును ఆమోదించామని బీజేపీ పదే పదే చెబుతూ వస్తోంది. కానీ తమ పార్టీలోనే మహిళలకు సముచిత స్థానం లేదని బీజేపీపై ఆరోపణలు ఉన్నాయి. ఆ మరకను పోగొట్టుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ పెద్దలు ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను మహిళా లీడర్‌కు అప్పగించాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారట. బీజేపీ ఏర్పడి 45 ఏళ్లు అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ మహిళ కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను చేపట్టలేదు. అటు కాంగ్రెస్‌లో చూస్తే ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటి వారు జాతీయ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఈక్రమంలో ఈసారి జాతీయ అధ్యక్ష బాధ్యతలను మహిళ నాయకురాలికి అప్పగించాలని బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారట.
ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా ఉన్నారు. 2020 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఇటీవల ఆయనకు మోడీ కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించాల్సి ఉంది. ఈక్రమంలో కేంద్రమాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మూడుసార్లు ఎంపీగా గెలిచిన దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మహనీయుడు ఎన్టీ రామారావు కూతురు కావడంతో పాటు.. సీనియర్ మోస్ట్ లీడర్, పైగా మహిళా కావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని.. దక్షిణాది రాష్ట్రాలపై పాగా వేసేందుకు మరింత అనుకూలంగా ఉంటుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాలను వారివైపు తిప్పుకునేందుకు సులభతరం అవుతుందని అనుకుంటున్నారట.
పురంధేశ్వరితో పాటు మరో పేరు కూడా వినిపిస్తోంది. వారే మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో అమేధీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే ఓడించారు. ఆ తర్వాత మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకొని అయిదేళ్ల పాటు యూనియన్ మినిస్టర్‌గా పనిచేశారు. ఈక్రమంలో పురంధేశ్వరికి కాకపోతే స్మృతి ఇరానీకి బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట. మరి చూడాలి వీరిలో ఎవరికి జాతీయ అధ్యక్ష పదవి దక్కుతుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ