టిటిడి చైర్మన్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న బి ఆర్ నాయుడు

BR Naidu Took Oath As The Chairman Of TTD Governing Body On 6Th Of This Month

టీటీడీ ఛైర్మన్‌గా టీవీ5 అధినేత బీఆర్‌ నాయుడుని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తిరుమలలో ఈ నెల 6వ తేదిన టిటిడి పాలకమండలి చైర్మన్ గా బి ఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. 29 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారి చేసింది ప్రభుత్వం.

తాజాగా ఆయన తన పదవి పై మాట్లాడుతూ..తనకు ఇంత గౌరవమైన పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు , ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఏడాదికి ఐదారుసార్లు తిరుమలకు వెళ్లే వాళ్లమని, గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో అనేక అరాచకాలు చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని వెళ్లలేదని చెప్పుకొచ్చారు. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగాను..చిన్నప్పటి నుంచి తిరుమల ఆలయానికి తప్ప మరో ఆలయానికి వెళ్లలేదన్నారు.

ఏటా ఆలయానికి వెళ్లే తాము.. ఐదేళ్లు వెళ్లలేదంటే ఆ బాధెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తమ ప్రాంతంలో కొండకు పోతామని అంటామని చెప్పారు. టీటీడీ ఛైర్మన్ పదవి రావడం తన జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నా అని, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని అన్నారు. తిరుమలలో చాలా సమస్యలున్నాయని, వాటిపై చంద్రబాబుతో గతంలోనే చర్చించినట్లు చెప్పారు. ఛైర్మన్ గా మరోసారి చర్చించి, ఆయన సలహాలతో ముందుకెళ్తామని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో పనిచేసేవాళ్లంతా హిందువులై ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆస్తుల్ని కాపాడేలా చర్యలు తీసుకుంటామని, అలాగే టీటీడీ భూములపై కమిటీ వేస్తామని బీఆర్ నాయుడు తెలిపారు.