ప్రస్తుతం భారత దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి ఎంటర్ అయిందో లేదో అప్పుడే భానుడి ప్రతాపం చూపడం మొదలెట్టాడు. ఇక మార్చి ఎంట్రీతో మరింత రెచ్చిపోతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఈసారి ఎండలు బాగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఈ రెండు నెలలు ఇక మాడు పగులడం గ్యారంటీ అని గుబులు పడుతున్నారు.
గతేడాది ఫిబ్రవరి అంతా కూల్ గానే ఉన్నా..ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో సూర్యుడు మండిపోయాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇదే జోరును కంటెన్యూ చేస్తూ వచ్చాడు. ఇక మార్చి ఎంటర్ అయిందో లేదో మరింత దూకుడు పెంచాడు. ఇటీవల రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇక మిడ్ సమ్మర్ లో అయితే రికార్డు బ్రేక్ చేస్తాడన్న ఆందోళనలో ప్రజలున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఉదయం 8 గంటల నుంచే ఎండ తాకిడి మొదలవుతుంది.తెలంగాణలో సగటు ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవగా.. ఏపీలో 33 నుంచి 35 డిగ్రీలు దాటుతున్నాయి. ఏసీలు, ఫ్యాన్స్ వాడకం పెరగడంతో ఇటు ఇప్పటికే కరెంటు వాడకం పెరిగినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఎండ వేడికి తట్టుకోలేక పుచ్చకాయలు, కూల్ డ్రింకులు, కొబ్బరి బొండాలు తాగుతూ జనాలు సేద తీరుతున్నారు. మరోవైపు అత్యవసరం అయితేనే తప్ప మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.బయటకు వెళ్లేవారు వెంట వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లాలని.. తలకు స్కార్ఫ్ కానీ, టోపీ కానీ పెట్టుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.