కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న మేయర్-ఎమ్మెల్యే మధ్య వివాదం రసాభాసగా మారింది. సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ కేటాయించకపోవడం, దాని మీద టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. మేయర్ సురేష్‌బాబు వేదికపై కేవలం తనకే కుర్చీ కేటాయించడం, ఎమ్మెల్యేకు ఆ అవకాశం లేకపోవడం వల్ల సమావేశం ప్రతిష్టంభనకు దారి తీసింది.
సర్వసభ్య సమావేశంలో తనకు కుర్చీ వేయాలనే డిమాండ్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. “గత ప్రభుత్వంలో ఇలా జరుగలేదు. కుర్చీ వేయకపోతే నేను నిలబడే ఉంటాను,” అని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డిని మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో టీడీపీ-వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది.
మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య కుర్చీల వివాదం కొనసాగుతుండగా, 7 టీడీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తూ మేయర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం టీడీపీ శ్రేణులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. అవినీతి ఆరోపణలు బయటకు వస్తాయనే భయంతో మేయర్ ఇలా చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు.
మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, మేయర్ సురేష్‌బాబు వ్యవహారం వైసీపీ నైజాన్ని ప్రతిబింబిస్తోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు. ‘‘మహిళలను గౌరవించని వ్యవహారం కరెక్ట్ కాదు. కుర్చీ లేని భయం ఎందుకు?’’ అని ప్రశ్నించారు.
ఉద్రిక్తతతో సమావేశం నడపలేని స్థితికి చేరుకోవడంతో మేయర్ సురేష్‌బాబు సభను వాయిదా వేశారు. ఒకవైపు టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన చేస్తుండగా, మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ పోటీగా ఆందోళన చేపట్టారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందనేది నగర ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.