
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో.. ఏకంగా 164 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు త్వరత్వరగా రెడీ అవుతున్నారు చంద్రబాబు.జూన్ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. చంద్రబాబుతో పాటు కొంతమంది మంత్రులు కూడా అదే రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
జూన్ 11న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరబోతోంది. టీడీఎల్పీ భేటీ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు సమావేశం అయి.. ఎమ్మెల్యేలంతా చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో.. వీరిలో ఏ పార్టీకి చెందిన వారికి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? లేదా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారనేది దేశ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, పూర్తి స్థాయి కేబినెట్‌తో పరిపాలన ప్రారంభించడానికి చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిపి 26 మందితో తమ కేబినెట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి, ఏయే వర్గాలకు ఎంత ప్రాధాన్యమివ్వడంతో పాటు.. మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలపైన చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం . అంతేకాకుండా సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపైన కూడా చంద్రబాబు కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కేబినెట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణస్వీకారం చేయడం దాదాపు ఖాయమైనట్లే. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండే అవకాశముంది.
చంద్రబాబు కేబినెట్లో పవన్ కళ్యాణ్‌తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులు జనసేన పార్టీకి లభించబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం విజ్ఞప్తితో ఆ పార్టీ నుంచి ఇద్దరిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు 164 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందటంతో.. ఆశావహుల సంఖ్య కూడా అంచనాలకు మించి ఉంది.మరి దీనిపై చంద్రబాబు కసరత్తు ఏ మేరకు సంతృప్తినిస్తుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE