ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు నూతన సంవత్సర కానుకగా పెద్ద మొత్తంలో నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటించనున్నట్టు సమాచారం. బీజేపీ, జనసేన నుంచి చంద్రబాబుకు ఇప్పటికే నామినేషన్ల జాబితాలు అందగా, చంద్రబాబు-పవన్ మధ్య తుది చర్చల తర్వాత ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి కసరత్తు జరుగుతోంది.
పదవుల పంపిణీపై ఉత్కంఠ
ఈ సారి నామినేటెడ్ పదవుల జాబితా పెద్దదిగా ఉంటుందని, ముఖ్యంగా టీడీపీ నుంచి అధిక సంఖ్యలో పదవుల ఆశావాహుల సంఖ్య ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. గత జాబితాలలో టీడీపీ నేతలకు ఎక్కువగా పదవులు లభించగా, ఈసారి కూటమిలోని మిగిలిన పార్టీలకు మరింత న్యాయం చేయాలని భావిస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో 60 కార్పొరేషన్లతో పాటు అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్, ప్రణాళిక సంఘం వంటి పలు కీలక సంస్థల పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలకు సీట్లు కేటాయించే ప్రక్రియలో కసరత్తు జరుగుతోంది.
ఎన్నికల సమయంలో కూటమి కోసం సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, పిఠాపురం వర్మ వంటి వారు జాబితాలో ఉన్నారు. బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, కోలా ఆనంద్, జనసేన నుంచి అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
నామినేటెడ్ పదవుల జాబితా కొత్త సంవత్సర ప్రారంభంలోనే ప్రకటించే అవకాశం ఉండటంతో, అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయం కూటమి అనుబంధాన్ని మరింత బలపరిచే అవకాశాలు ఉన్నాయి.