ఆంధ్రప్రదేశ్‌లో గత పదిహేనేళ్లుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 ఆగస్టు 15వ తేదీకి ముందు ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు, ఇప్పుడు ఆ ఇళ్లను లేదా స్థలాలను అమ్ముకునేందుకు (రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు) ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఆమోదం తెలపడంతో లక్షలాది మంది పేదలకు తమ ఆస్తిపై సర్వహక్కులు లభించనున్నాయి.
పదేళ్ల నిబంధన సడలింపు
సాధారణంగా ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపై పదేళ్ల వరకు విక్రయించకూడదనే నిబంధన ఉంటుంది. అయితే, చాలా కాలంగా పట్టాలు పొంది, ఆ ఇళ్లలోనే నివసిస్తున్న వారు ఆర్థిక అవసరాల కోసం లేదా ఇతర కారణాల వల్ల ఆ ఆస్తిని అమ్ముకోవాలనుకున్నా చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. తాజా నిర్ణయంతో 2016కు ముందు పట్టాలు పొందిన వారందరికీ ఈ ‘నిషేధిత జాబితా’ (22A) నుండి విముక్తి లభించింది.
లక్షలాది మందికి ప్రయోజనం
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది. గతంలో పట్టాలు ఇచ్చినా, వాటికి యాజమాన్య హక్కులు లేకపోవడంతో బ్యాంక్ రుణాలు పొందడం లేదా అత్యవసర సమయంలో అమ్ముకోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో, లబ్ధిదారులు నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి లావాదేవీలు జరుపుకోవచ్చు.
సీఎం చంద్రబాబు హామీ అమలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు ఈ ఫైలుపై సంతకం చేశారు. పేదలకు ఇచ్చిన ఆస్తికి పూర్తి విలువ ఉండాలని, వారు తమ ఆస్తిని తాకట్టు పెట్టుకుని రుణాలు పొందే అవకాశం ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా 2016కు ముందు ఇచ్చిన పట్టాల వివరాలను సేకరించి, రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు.
నిబంధనలు ఇవే..
-
2016 ఆగస్టు 15 లోపు ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టా పొంది ఉండాలి.
-
సదరు లబ్ధిదారుడు లేదా వారి వారసులు ఆ స్థలంలో కనీసం పదేళ్లు నివసించి ఉండాలి.
-
లబ్ధిదారులు తమ పట్టా కాపీ మరియు ఆధార్ కార్డుతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది.
-
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.







































