ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి డివిజన్, తలుపుల మండలం, పెదన్నవారిపల్లి గ్రామంలో సీఎం స్వయంగా లబ్దిదారులకు పింఛన్ మొత్తాన్ని అందజేశారు.
నవంబర్ నెలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,64,802 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ.115.92 కోట్లు పింఛన్ సొమ్ము మంజూరైంది. ముఖ్యమంత్రి పర్యటన జరిగే పెదన్నవారిపల్లి గ్రామంలోనే 756 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.
సంక్షేమంపై సీఎం దృష్టి:
అనంతరం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమమని పేర్కొన్నారు. “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు” అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడం కోసం మొదటి అడుగు పడిందని, ఆర్థిక అసమానతలు లేని సమాజమే తన లక్ష్యమని వెల్లడించారు.
కాగా, గతంలో పింఛన్ల పంపిణీ సచివాలయ సిబ్బందితో సాధ్యం కాదన్నారని, కానీ ఇప్పుడు 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించి, యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

































