ఏపీలోని ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు జరిగేందుకు, ఇసుక లభ్యత పెంచేందుకు సీనరేజ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఉచిత ఇసుక విధానం నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఏపీ నుంచి తమిళనాడులోని చెన్నై, తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు రహదారుల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందన్నారు. కావున.. ఆయా మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పటిష్ఠ పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీ శాండ్ పాలసీలో ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ఇసుకను తీసుకెళ్లే వ్యక్తులు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేయించాలని సూచించారు. ఇసుక కొరత తీర్చేలా రీచ్ లలో తవ్వకాలు, లోడింగ్ ప్రక్రియ ప్రైవేటుకు అప్పగించే అంశంపై ఆలోచన చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా స్థాయి శాండ్ కమిటీ పారదర్శకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్ యార్డుల ద్వారా సరఫరా చేయాలని తెలిపారు.
అనేక ప్రాంతాల్లో ఇసుక ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో, పటిష్ట పర్యవేక్షణతో పాటు చెక్‌పోస్టుల ఏర్పాటు చేయడం ద్వారా అక్రమ మార్గాల ద్వారా ఇసుక తరలింపును నియంత్రించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, పలు ప్రాంతాల్లో ఇసుక కొరత కారణంగా వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాముఖ్యతను ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించి, పర్యవేక్షణ విధానాలను కఠినంగా అమలు చేయాలని, ప్రజల అవసరాలను తీర్చేందుకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆయన సూచించారు.