అక్రమ కేసులు.. అక్రమ కేసులు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో మారుమ్రోగిపోయిన అంశం ఇది. ప్రతిపక్ష నాయకులపై అక్రమకేసులు పెట్టి వైసీపీ పాలకులు వేధిస్తున్నారని ఆప్పట్లో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై.. మరికొందరిపై కక్ష్యపూరితంగా వైసీపీ పాలకులు అక్రమ కేసులు పెట్టించారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ ఓటమికి ఇది కూడా కారణమయింది. అప్పట్లో కొందరు ప్రతిపక్ష నేతలపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా తాడిపత్రిలో టీడీపీ కీలక నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా 60కి పైగా కేసులు నమోదు చేశారు. మరెంతో మందిని ఇలాగే అక్రమ కేసులు పెట్టి వేధించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దౌర్జన్యాలు, అక్రమాలు, బెదిరింపులు, అక్రమ కేసుల నమోదు గురించి వివరించారు. ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని అరాచకాలకు పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై.. తనపై కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు. అలాగే తనపై.. పవన్ కళ్యాణ్‌పై ఉన్న కేసులను బయట పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా 17 కేసులు పెట్టారని చంద్రబాబు వెల్లడించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్‌పై 7 కేసులు పెట్టారని అన్నారు.
అత్యధికంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై 60కి పైగా కేసులు పెట్టారని తెలిపారు. ఫర్నీచర్ దుర్వినియోగం చేశారని తప్పుడు ఆరోపణలు చేసి కోడెల శివప్రసాద్‌పై 18 కేసులు పెట్టారని అన్నారు. ఆ అవమానం తట్టుకోలేకనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని.. దూళిపాళ్ల నరేంద్రను జైలుకు పంపారని.. పులివెందులలో పోటీ చేసిన రవీంద్రనాథ్‌పై కేసులు పెట్టి జైలుకు తరలించారని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వాధికారులపై దాడులు చేశారని కూన రవికుమార్‌పై కూడా అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. వంగలపూడి అనిత, అయ్యన్నపాత్రుడిపై కూడా తప్పుడు ఆరోపణలు చేసి ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార యత్నం కేసులు పెట్టారని వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ