కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తుండటంతో.. ఒక్కో సంక్షేమ పథకాన్ని పట్టాలెక్కించాలని చూస్తోంది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు .. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నిధుల కొరత వేధిస్తున్నా కూడా ప్రజల్లో చిన్నపాటి అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
దీనిలో భాగంగానే సీఎం చంద్రబాబు తాజాగా ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పదాల వల్లే ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని గుర్తు చేసిన సీఎం..అందుకే సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఎంత కష్టం అయినా సరే తాము సంక్షేమ పథకాలను మాత్రం తప్పకుండా అందిస్తామని తేల్చి చెప్పారు చంద్రబాబు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకాన్ని ..తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని.. మే నెలలో తల్లుల అందరి అకౌంట్లలో నిధులు జమ చేస్తామని ప్రకటించారు.
వైసీపీ హయాంలో అమ్మ ఒడి పేరుతో అందించిన ఈ పథకంలో.. ఇంట్లో ఒక పిల్లాడి చదువుకు ఆర్థిక సాయం అందించారు. తొలి ఏడాది 15 వేల రూపాయల చొప్పున అందించిన జగన్ సర్కార్… తరువాత 14 వేల రూపాయలకు, ఆ తరువాత 13 వేల రూపాయలకు పరిమితం చేసింది. అయితే ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకు 15వేల రూపాయల చొప్పున అందిస్తామని ఎన్నికల్లో ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాలలో ప్రధానమైన హామీలో ఒకటైన తల్లికి వందనం పథకం కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా ఇంకా అమలు చేయలేదు.
తాజాగా శనివారం గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన సీఎం చంద్రబాబు.. తల్లికి వందనం పథకం అమలుపై ప్రకటన చేసి క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే అంటే మే నెలలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల వార్షిక బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులు జరిపినా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబు ఈ పథకం అమలు షెడ్యూల్ను ప్రకటించడంతో ఏపీ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ఏపీలో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం అయి..తిరిగి జూన్ 12న పాఠశాలలు తెరుచుకుంటాయి . అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవక ముందే.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పేరుతో నిధులు జమ చేసి పరిస్థితి కనిపిస్తోంది. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఈ ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య 82 లక్షలుగా ఉంది. ఈ లెక్కన 13వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం పడతాయి. కాకపోతే విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేయాలంటే మాత్రం తప్పనిసరిగా 75% హాజరు ఉండాలి.