వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్థానం..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు 75వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఏపీ వ్యాప్తంగానే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులందరూ కూడా బాబు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో సామాన్య రైతు కుటుంబంలోనే జన్మించారు. ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని గ్రామంలో పుట్టిన చంద్రబాబు, పట్టుదలతో చదువుకున్నారు. అలాగే ఎన్నో కష్టాలను అధిగమించి రాజకీయ రంగంలో దిగ్గజ నాయకుడిగా ఎదిగారు. చిన్నతనంలో పాఠశాలకు 16 కిలోమీటర్లు నడిచి వెళ్లడం, వానాకాలంలో వాగులు దాటడం వంటి సవాళ్లను ఎదుర్కొన్న చంద్రబాబు ఈ వయసులో కూడా అదే క్రమశిక్షణ, దృఢ సంకల్పంతో తన లక్ష్యాలను సాధించడంలో చూపిస్తారు.

చంద్రబాబు బాల్యం అంతా గ్రామీణ వాతావరణంలో, తండ్రి కర్జూరనాయుడు పొలంలో పనిచేస్తూనే గడిచింది. నాగలితో దుక్కి దున్నడం, పశువులను మేతకు తీసుకెళ్లడం వంటి అనుభవాలు ఆయనకు జీవితంలో సామాన్యుల కష్టాలను అర్థం చేసుకునే మనసుని ఇచ్చాయి. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబు..అప్పట్లోనే యువతను సమీకరించడంలో తన నాయకత్వ పటిమను చాటారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన బాబు..రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ.. తన గ్రామ అభివృద్ధికి కృషి చేశారు, భీమవరం రోడ్డు నిర్మాణంలో శ్రమదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

అలా 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున నిలబడ్డ చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచి.. 28 ఏళ్ల వయసులోనే శాసనసభలో అడుగుపెట్టారు. 1980లో మంత్రిగా పనిచేస్తూ సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖలను నిర్వహించారు. ఎన్టీఆర్‌తో బంధుత్వం ద్వారా టీడీపీలో చేరిన బాబు.. 1984లో ఎన్టీఆర్‌పై జరిగిన రాజకీయ కుట్ర సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్రను పోషించారు. తర్వాత 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి..హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చారు. 2024లో నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆయన, అమరావతిని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దడానికి, పోలవరం నిర్మాణానికి కృషి చేస్తున్నారు.

చంద్రబాబు పాలనలో జన్మభూమి, శ్రమదానం, డ్వాక్రా సంఘాలు, దీపం పథకం వంటి కార్యక్రమాలు గ్రామీణ అభివృద్ధి, మహిళలకు సాధికారతనిస్తూ వారికి ఆర్థికంగానూ ఊతమిచ్చాయి. ఈ–సేవ, హైటెక్స్, విజన్‌ 2020 వంటి చొరవలతో బాబు డిజిటల్‌ యుగం వైపు ఆంధ్రప్రదేశ్‌ను నడిపించారు. మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు ఆకర్షించడం, శంషాబాద్‌ విమానాశ్రయం నిర్మాణం వంటి కీలక నిర్ణయాలు చంద్రబాబు దూరదృష్టిని చాటాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో 2023లో 53 రోజుల జైలు శిక్ష అనుభవించినా..బాబు పట్టుదలతో ప్రజల మద్దతుతో తిరిగి రాజకీయంగా ఉద్భవించి నాలుగోసారి సీఎం పీఠం ఎక్కారు. పీ4 పథకం, వాట్సాప్‌ గవర్నెన్స్‌ వంటి కొత్త పథకాలతో ఆయన పేదరిక నిర్మూలన, సమర్థ పాలనకు కృషి చేస్తూనే ఉన్నారు.

చంద్రబాబు వ్యక్తిగత జీవితంలో కూడా సరళత, క్రమశిక్షణకు ప్రాధాన్యమివ్వడం వల్లే రాజకీయాలలోనూ అంతగా రాణిస్తున్నారు. ఆరోగ్యకరమైన శాఖాహారం, యోగా, ధ్యానం వంటి అలవాట్లతో జీవనశైలిని కొనసాగిస్తున్నారు. భువనేశ్వరితో వివాహం, హెరిటేజ్‌ ఫుడ్స్‌ స్థాపన, కుటుంబ బాధ్యతల్లో భాగస్వామ్యం వంటివి చంద్రబాబు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను చాటాయి. రాజకీయంగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు. 2003 అలిపిరి దాడి ఘటన, 2019 ఎన్నికలలో ఓటమి, 2023 అరెస్టు ఆయన మానసిక దృఢత్వాన్ని, ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని నిరూపించాయి.

చంద్రబాబు నాయుడు మరెన్నో మైలురాళ్లు అధిగమించాలని, మరిన్ని ప్రజా సంక్షేమ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, విజన్ ఉన్న నేత.. విజన్‌ 2047 కల సాకారం కావాలని ఆశిద్దాం. మ్యాంగో న్యూస్ తరఫున సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.