కుంభమేళాలా గోదావరి పుష్కరాలు.. ప్రణాళిక సిద్ధం చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Orders Kumbh Mela-Like Facilities For Godavari Pushkaralu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు – 2027 నిర్వహణకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఈ మెగా ఈవెంట్‌పై తొలిసారిగా అమరావతిలోని సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు  వచ్చే ఏడాది జరగబోయే ఈ పుష్కరాలను కేవలం ఒక మతపరమైన వేడుకగానే కాకుండా, ప్రపంచం గర్వించేలా ‘కుంభమేళా’ తరహాలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

కాగా, వచ్చే ఏడాది జూన్ 26 నుండి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ 12 రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇక్కడ ఉన్నాయి

గోదావరి పుష్కరాలు 2027: కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు..
  • 10 కోట్ల మంది భక్తులు: ఈ పుష్కరాలకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుండి కూడా సుమారు 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని సీఎం అంచనా వేశారు. అందుకు అనుగుణంగా వసతి, రవాణా, భద్రత ఏర్పాట్లు ఉండాలని సూచించారు.

  • ముందస్తు పనులు: పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయం మాత్రమే ఉందని, ఇప్పటి నుండే ప్రతి శాఖ తన ప్రణాళికలను అమలు చేయాలని నిర్దేశించారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆర్థిక శాఖకు సూచించారు.

  • ఘాట్ల విస్తరణ: ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరో 139 కొత్త ఘాట్లను నిర్మించనున్నారు. మొత్తం 373 ఘాట్లను సుమారు 10 కిలోమీటర్ల పొడవునా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలో ఒక ‘మోడల్ ఘాట్’ నిర్మించి, దాని ఆధారంగా మిగిలిన ఘాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.

  • ఆరు జిల్లాలపై ఫోకస్: గోదావరి ప్రవహించే ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు పల్నాడు (పోలవరం ప్రాంతం) జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  • వసతి సౌకర్యాలు: భక్తుల కోసం టెంట్ సిటీలు, హోం స్టే (Home Stay) విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, స్థానికులను కూడా ఈ ఆతిథ్యంలో భాగస్వాములను చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • పోలవరం అనుసంధానం: పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని, తద్వారా పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పేలా..

ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఇది మూడో గోదావరి పుష్కరాల నిర్వహణ. గతంలో 2003, 2015లలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి టెక్నాలజీని వాడుకుంటూ క్రౌడ్ మేనేజ్‌మెంట్ (Crowd Management) పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

అందుకోసమే ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకాన్ని జోడించి, రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ఈ పుష్కరాలను ఒక వేదికగా సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా గోదావరి పుష్కరాలు. కోట్లాది మంది భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here