శ్రీకాకుళం జిల్లాలోని **కాశీబుగ్గ**లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక **వేంకటేశ్వరస్వామి ఆలయం** వద్ద జరిగిన తొక్కిసలాటలో 9మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఘటన వివరాలు:
కార్తీక మాసం శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ రద్దీని నియంత్రించడంలో జరిగిన లోపం కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు వెంటనే ప్రారంభమయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి:
ఈ దురదృష్టకర ఘటనపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం, గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను ఆయన కోరారు.
హోంమత్రి అనిత తీవ్ర విచారం:
అలాగే ఈ దుర్ఘటనపై హోంమత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళా భక్తుల పట్ల ఆమె బాధను వ్యక్తం చేస్తూ, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆలయం మొదటి అంతస్తులో ఉండటం, భక్తులు దాదాపు 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్ ఊడిపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని హోంమంత్రి వివరించారు. ఈ ఆలయానికి సాధారణంగా ప్రతి వారం 1,500 నుంచి 2,000 మంది భక్తులు వస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని తెలుస్తోందని ఆమె తెలిపారు.



































