ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తీసుకున్నామని, ప్రజలే తమకు ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మందికి పెంచిన పింఛన్లు అందజేస్తున్నామని, దివ్యాంగులకు రూ.6,000 పింఛన్ అమలు చేస్తున్నామని తెలిపారు. రెండు నెలలు పింఛన్లు తీసుకోని వారు 93,300 మంది ఉన్నారని, వారికి కూడా సౌలభ్యం కల్పించామని చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు అదనంగా నెలకు రూ.76 కోట్లు భారం అయినా, పేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంవత్సరానికి రూ.33,100 కోట్లు ఖర్చు చేసి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
అంతేకాక, గత పాలకుల పాలనలో విశాఖ స్టీల్‌ప్లాంట్ దివాళా తీసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.11,000 కోట్లు కేంద్రం ఇచ్చిందని, దీంతో స్టీల్ ప్లాంట్ గాడిన పడిందని చెప్పారు. అలాగే, విశాఖకు రైల్వే జోన్ మంజూరయ్యిందని, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు. రాజధాని అమరావతిలో పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, మూడు నాలుగేళ్లలో పూర్వ వైభవం తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేసి నదుల అనుసంధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా DSC నోటిఫికేషన్‌పై సీఎం కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోపే మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారికంగా వెల్లడించారు. ఉపాధ్యాయ పోస్టుల కోసం వేలాదిమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యేలోపు, అంటే జూన్ లోగా ఖచ్చితంగా DSC పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని, సంక్షేమ పథకాలను పకడ్బందిగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.