సింహాచలం ఘటనపై సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ రియాక్షన్

సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా అప్పన్న సన్నిధిలో జరిగిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపైన గోడ కూలి మృతి చెందడం తనను కలచివేసిందన్న సీఎం.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఊహించని ప్రమాదం జరిగిందని వివరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు.

సింహాచలం ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. అలాగే ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో.. అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి చెందడం చాలా దురదృష్టకరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన పవన్.. కూటమి ప్రభుత్వం వారికి పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నానని, వర్షాల వల్లే గోడ కూలినట్లు సమాచారం అందిందని చెప్పారు.

అటు అప్పన్న ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తనను ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తరలించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన లోకేష్..ప్రభుత్వం వారి వెంటే ఉందని భరోసా ఇచ్చారు.

కాగా ఈ ప్రమాదానికి కారణమైన గోడకు రెండు వైపులా అధికారులు ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గోడ కూలిన సమయంలో గోడ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు నేరుగా..అక్కడున్న భక్తులపై పడకుండా ఆ ఫెన్సింగే అడ్డుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అదే కనుక లేకపోయినట్లయితే పెద్ద ప్రమాదం జరిగి మృతుల సంఖ్య భారీగా పెరిగేదని అంటున్నారు.