ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రపై అంతటా ఉత్కంఠ ఏర్పడింది. రాయి దాడి అనంతరం.. ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకున్న జగన్ 15వ రోజు యాత్ర పునః ప్రారంభించారు. దాడి ఘటన నేపథ్యంలో సీఎం భద్రతలో భారీ మార్పులు చేశారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే సభలు చేపట్టాలని నిర్ణయించారు. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు విధించారు. కాగా, కేసరిపల్లి నైట్ క్యాంప్ నుంచి జగన్ యాత్ర ప్రారంభమైంది. గన్నవరం, ఆత్కూరు, వీరపల్లి క్రాస్, హునుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా సాగింది. జొన్నపాడులో జగన్ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి జొన్నపాడు, జనార్ధనపురం మీదుగా సాయంత్రం గుడివాడకు చేరుకుంటారు. గుడివాడలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. దాడి తర్వాత జగన్ ఏం మాట్లాడనున్నారో అనేది ఆసక్తిగా మారింది.
కాగా.., తనపై జరిగిన దాడిపై జగన్మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను కలిసిన నేతలతో ఆయన మాట్లాడారు. ‘‘బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను చూసే దాడులు చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పింది. మరోసారి అధికారంలోకి వస్తున్నాం.. ఆందోళన వద్దు.. ధైర్యంగా ముందడుగు వేద్దాం’’ అని జగన్ పేర్కొన్నారు. బస్సుయాత్రలో జగన్ ను కలుస్తున్న ప్రజలు, పార్టీ నేతలు సీఎం యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆందోళన వద్దని దేవుడి దయ, ప్రజల అండదండలతో అంతా మంచే జరుగుతుందని వారికి జగన్ భరోసా ఇస్తున్నారు.
మరోవైపు.. దాడి నేపథ్యంలో పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు జరుగుతుంటే, పోలీసులు ఏం చేస్తున్నారని అధికారపక్షంతో పాటు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. డీజీపీని, సీపీని సస్పెండ్ చేయాలని టీడీపీ నేత బుచ్చయ్యచౌదరి, సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆధారాలు సేకరిస్తున్నారు. దూరం నుంచి జగన్ కు తగిలేలా రాయి ఎలా విసిరారు.. ఎయిర్ గన్ లాంటివి ఉపయోగించారా.. అనేది పరిశీలిస్తున్నారు. ఒకే ఫోన్ నెంబర్ నుంచి ఎక్కువ సార్లు వెళ్లినా, వచ్చిన కాల్స్ వివరాలపై ఆరా తీస్తున్నారు. దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి పోలీసులు రెండు లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY