ఏపీలో పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్ష..

CM Perception Tracking Review In AP

ఏపీ సీఎం చంద్రబాబు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల అంశంపై కీలక ఆదేశాలను జారీ చేశారు. దీపం పథకం, ఆర్టీసీ సర్వీసులు, రేషన్‌ బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు.. ప్రజాస్పందనపై పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్ష నిర్వహించారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు రావడంపై ఆరా తీసి.. అధికారుల నుంచి వివరణ కోరారు.

ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే వాటిని డెలివరీ చేసే సమయంలో లబ్ధిదారుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. వీటిపై విచారణ చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు.ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్‌ ఏజెన్సీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బులు వారి ఖాతాలకి జమ కావడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయని.. వెంటనే కారణాలు విశ్లేషించి సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలన్నారు.

ఏపీలో ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతీ ఆర్టీసీ బస్సులో క్యూఆర్‌ కోడ్‌ అందుబాటులో ఉంచాలని.. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. వెంటనే అక్కడ సదుపాయాలను కల్పించాలని అన్నారు.

ఏపీ వ్యాప్తంగా ప్రతిశాఖ తిరిగి గాడిలో పడాలని.. ప్రజలకందించే సేవల్లో మార్పు కనిపించాలన్నారు. పథకాలు, ఇతర అంశాలపై ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌పై..పొరపాట్లు, తప్పులు జరిగిన చోట సరిదిద్దాలని సూచించారు. అవినీతికి, నిర్లక్ష్యానికి తావు లేకుండా.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని చెప్పిన సీఎం.. ఆయా పథకాలు, కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాల వారీగా కూడా ర్యాంకులు కూడా కేటాయిస్తామన్నారు.

అలాగే రేషన్‌ సరకుల విషయంలో కూడా లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. పంపిణీలో ఎక్కువ ధర తీసుకుంటున్నట్లు అక్కడక్కడా ఫిర్యాదులు వచ్చాయని.. రేషన్‌ వ్యవహారంలో అవినీతి ఉండకూడదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలే ఫస్ట్‌ అనే విధానంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని.. దానికి తగినట్లుగానే అన్ని శాఖల్లో, స్థాయిల్లో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని సూచించారు.