ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పరిశీలించారు. కొత్తగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన విడదల రజని శాఖాపరమైన తన తొలి సమీక్షా సమావేశానికి హాజరు కావడం విశేషం. ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ వినయ్ చంద్ ఇంకా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆరోగ్య, వైద్య శాఖ అధికారులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగానే ఏడాదికొకసారి ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలని, దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్టు అవుతుందని పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎంపిక చేసి, ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీలో సులువుగా వైద్య సేవలు పొందడం ఇలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు దగ్గరలో ఉన్న ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామ సచివాలయాలలో దీనికి సంబంధించిన హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఎక్కడా అలసత్వం ఉండరాదని, దీనిపై ఇంకా ఏమైనా అవసరమనుకుంటే ఆ మేరకు ప్రొసీజర్లు పెంచుకోవచ్చని సీఎం జగన్ సూచించారు. క్యాన్సర్ రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలని, అలాగే వారికి ఆరోగ్యశ్రీ కింద పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలన్నారు. ఒక ముఖ్యమంత్రిగా నేను లక్ష్యాలను నిర్దేశిస్తానని, కానీ ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు అధికారులు సిన్సియర్ గా పనిచేయాలని సూచించారు. అలాగే ఉన్నతాధికారులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది పూర్తి బాధ్యతగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై స్పందిస్తూ సీఎం జగన్.. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. డైలీ యాక్టివిటీ రేటు 0.13శాతానికి గణనీయంగా పడిపోయిందని, 15– 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి వందశాతం 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నవారికి మొదటి డోసు 94.47 శాతం వ్యాక్సిన్లు వేశామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న కొత్త మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించగా.. నిర్మాణంలో ఉన్న 16 మెడికల్ కాలేజీల్లో 6 చోట్ల పనులు వేగవంతంగా సాగుతున్నాయని, అలాగే పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ