ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై సమీక్ష నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, “మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాలి. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం–హైలీ స్పెషలైజ్డ్ మెడికల్ కేర్ కోసం వాళ్లు వెళ్తున్నారు. అందువలన రాష్ట్రంలో ప్రత్యేకంగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లా కేంద్రాలతో పాటుగా విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కార్పొరేషన్లలో కలుపుకుని మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఉండాలి. ఒక్కో చోట కనీసంగా 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున ఉచితంగా భూమి కేటాయించాలి. మూడేళ్లలో కనీసంగా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకు ఆ భూములు ఇవ్వాలి. దీనివల్ల కనీసంగా 80 మల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయి. వీటితో పాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు, 16 నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయి” అని చెప్పారు.
హెల్త్ హబ్‌ల ఏర్పాటుతో ప్రభుత్వ పరంగా ఆరోగ్య రంగం బలోపేతం అవుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం వల్ల ప్రైవేటు రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయి, ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లా కేంద్రంతో పాటు, కార్పొరేషన్లలో మల్టీ స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయి. దీని వల్ల టెరిషియరీ కేర్ విస్తృతంగా మెరుగు పడుతుంది. ఇతర ప్రాంతాలకు వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు: ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు కూడా మంచి ప్రమాణాలతో వైద్యం అందుతుంది. హెల్త్ హబ్‌లపై ఒక నెల రోజుల్లో పాలసీని తీసుకురావాలి. అలాగే వాక్సిన్ తయారీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యేలా కూడా తగిన చర్యలు తీసుకోవాలి. దానిపై ఒక విధానాన్ని తీసుకు రావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ