కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు పన్నుల వాటా కింద నిధులు కేటాయిస్తూ ప్రకటన చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా కింద వాటిని విడుదల చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి రూ. 4787 కోట్లు కేటాయించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి రెవెన్యూ లోటు కింద రూ. 10వేల కోట్లు, పోలవరం పేరుతో మరో రూ. 12వేల కోట్లు కేటాయించిన కేంద్రం తాజాగా పన్నుల వాటాలో కూడా భారీగా నిధులు కేటాయించడం జగన్ ప్రభుత్వానికి ఊరటగా మారింది.
తెలంగాణాకి మాత్రం కేవలం రూ. 2486 కోట్లు మాత్రమే దక్కాయి. వాస్తవానికి జీఎస్టీలో ఏపీ కన్నా తెలంగాణా వాటా ఎక్కువ. అయినప్పటికీ తాజా కేటాయింపుల్లో తెలంగాణా ప్రభుత్వానికి తక్కువ వాటా దక్కింది. ముఖ్యంగా ఎన్నికల సన్నాహాల్లో ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం తగిన వాటా కేటాయించి ఉంటే ఉపశమనంగా ఉండేది. వివిధ పథకాలు , అభివృద్ధి కోసమంటూ నిధులు విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ కేంద్రం మాత్రం అలాంటి అవకాశం లేకుండా ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన దానిలో సగమే తెలంగాణా కి ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది.
అదే సమయంలో తెలంగాణాతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు కూడా తగిన మోతాదులో పన్నుల కేటాయింపు జరగలేదనే వాదన వినిపిస్తోంది. తమిళనాడుకి రూ. 4825, కర్ణాటకకి రూ. 4314, కేరళకి రూ. 2277కోట్లు మాత్రమే కేటాయించారు. జీఎస్టీ లెక్కల ప్రకారం మహారాష్ట్ర తర్వాత తమిళనాడు ముందుంటుంది. అయినప్పటికీ పన్నుల వాటా మాత్రం స్వల్పమే దక్కింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు భారీగా నిధులు దక్కాయి. మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి దక్కిన వాటా కన్న ఒక్క యూపీకే ఎక్కువ నిధులు వెళ్లాయి. ఏకంగా రూ. 21,218 కోట్లు ఆ ఒక్క రాష్ట్రానికే కేటాయించారు. దాంతో సోషల్ మీడియాలో దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటా ఇచ్చి, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వడం ద్వారా వివక్ష చూపుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల తర్వాత సౌత్ నుంచి బీజేపీ ఖాళీ అయ్యింది. అది కూడా ఓ రాజకీయ కారణంగా కొందరు విమర్శలు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE