రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను జూలై 7 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగింపు, కర్ఫ్యూ సడలింపు సమయం పెంపుపై ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూల్, అనంతపురం వంటి 9 జిల్లాల్లో నేటి నుండి (జూలై 1) ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండనుండగా, ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయనున్నారు.
ఈ కర్ఫ్యూ సడలింపు ఆదేశాలు జూలై 7వ తేదీవరకు అమల్లో ఉండనున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలంతా సహకరించి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ముందుగా రాష్ట్రంలోని జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా కర్ఫ్యూ ఆంక్షల సడలింపుపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ








































