ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండగా, సైబర్ నేరగాళ్ల ఆగడాలు కూడా పెరుగుతున్నాయి. సాంకేతికతను తమ దుశ్చర్యలకు ఉపయోగించుకుంటూ వారు సామాన్య ప్రజలు, రాజకీయ నేతలు, ఇక్కడివాళ్లే కాకుండా పోలీసులనే మోసం చేస్తున్నారు. తాజాగా, సైబర్ నేరగాళ్ల మోసాలకు సంబంధించిన రెండు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.
విజయవాడ యువతి నుంచి రూ.1.25 కోట్లు కాజేశారు
విజయవాడ గాయత్రినగర్‌కు చెందిన 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు ముంబై పోలీసులమని ఫోన్ చేసి మోసం చేశారు. “మీకు వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయని, అరెస్ట్ చేస్తామని” బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. అది చట్టరీత్య నేరమని యువతిని అరెస్ట్ చేస్తానని బెదిరించాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే తనకు డబ్బులివ్వాలని బెదిరించాడు. దీంతో కంగారు పడిన యువతి పలు దఫాలుగా కేటుగాడి అకౌంట్‌కు రూ.1.25 కోట్లు పంపింది. ఆ తర్వాత మోసపోయినట్టు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రిని మోసం
బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీని కొంతమంది దుండగులు ప్రభుత్వంలో ఉన్నత హోదా ఉద్యోగం ఇస్తామని నమ్మించి రూ.25 లక్షలు గుంజేశారు. మోసం జరిగినట్లు గ్రహించిన ఆయన బరేలీ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు మాయం అయ్యాయి. అమ్మనబ్రోలుకు చెందిన పోకూరి శ్రీనివాసరావుకు స్థానిక కెనరా బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. అందులో రూ.2.40 లక్షల డబ్బులు ఉండగా.. తన ప్రమేయం లేకుండా విత్‌డ్రా అయినట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆయన నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల హెచ్చరిక
డిజిటల్ అరెస్ట్ పేరుతో నకిలీ ఫోన్లు చేసి డబ్బులు కాజేయడం నేరగాళ్ల కొత్త వ్యూహంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లకు ప్రతిస్పందించకూడదని, డబ్బులు పంపేందుకు ఒప్పుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే, అలాంటి కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఈ సంఘటనలు సైబర్ నేరాల ముప్పును మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. టెక్నాలజీ ఉపయోగంలో జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు.