అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో 50 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి భవనం కూలిపోగా.. దాని శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని చనిపోయి ఉంటారని.. అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయితే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
సెజ్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం, వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు ప్రగాడ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించాలని అంతేకాదు వారు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితుకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రమాదంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు.
కాగా అచ్చుతాపురం సెజ్ ప్రమాద స్థలానికి వెళ్లి నేడు సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించనున్నారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ ఘటనపై హెల్త్ సెక్రటరీ, సెక్రటరీ ఇండస్ట్రీస్, డైరెక్టర్ ఫ్యాక్టరీస్, కమిషనర్ లేబర్, డైరెక్టర్ బాయిలర్స్, ఎస్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారుతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారికి సూచనలు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.