ఏపీ ఎన్నికల్లో జనసేన హడ్రెండ్ పర్సెంట్ సక్సెస్ రేటు సాధించిన విషయం తెలిసిందే. 21కి 21 అసెంబ్లీ స్థానాలు.. పోటీ చేసిన రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ గెలుపొంది తిరుగులేని పార్టీగా అవతరించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలోనూ జనసేన కీలక పాత్ర పోషించింది. అందుకు తగ్గట్లుగానూ ప్రభుత్వంలోనూ జనసేనకు తగిన ప్రాధాన్యత లభించింది. ముఖ్యమంత్రి బాధ్యతలను తాను తీసుకున్న చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా కీలక శాఖలను పవన్‌కు అప్పగించారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ జనసేనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఒకటి సాధించాక అంతటితో ఆగిపోరు. దానికి మించినది సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అటువంటి ప్రయత్నాల్లోనే ఉన్నారని తెలుస్తోంది. 2029 ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారట. ముఖ్యమంత్రి పదవిపై పవన్ కన్నేశారని.. 2029లో ముఖ్యమంత్రి అవ్వడమే లక్ష్యంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ ఇటీవల జనసేన గెలిచింది 21 స్థానాలే. కనీసం మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గర్లో కూడా జనసేన లేదు.
అందుకోసమే ఈ అయిదేళ్లలో జనసేనను ఏపీలో మరింత పటిష్టం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. 2029 నాటికి రాష్ట్రమంతటా పార్టీ విస్తరించాలని.. కనీసం 150 స్థానాల్లో అయినా ప్రభావం చూపేలా ఉండాలని పవన్ అనుకుంటున్నారట. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలను పవన్ సిద్ధం చేశారట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. ఏపీ వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఊహించని స్థాయిలో భారీ రెస్పాన్స్ వచ్చింది. పది లక్షలకు పైగా మంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటికీ ఆ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. జనసేనలో చేరేందుకు పెద్ద ఎత్తున నేతలు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్.. గ్రామ పంచాయతీలపై ఫోకస్ పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు లేక గ్రామపంచాయతీల్లో పనులు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. పవన్ వచ్చాకే పంచాయతీలకు నిధులు అందుతున్నారు. ఈక్రమంలో పెద్ద ఎత్తున గ్రామాల్లో సర్పంచులు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే ఊపును 2026 వైపు కొనసాగించాలని.. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. మొత్తానికి ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో జనసేనను భారీగా విస్తరించి.. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేయడమే లక్ష్యంగా పవన్ ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ వ్యూహాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయనేది చూడాలి మరి.